కరీంనగర్: ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) ద్వారా అందుతున్న వైద్య సేవల తీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. ఈహెచ్ఎస్ అమలు తీరును పరిశీలించేందుకు ఆయన కరీంనగర్లోని పలు ఆసుపత్రులను సందర్శించారు.
ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ పర్యవేక్షణలో కరీంనగర్లోని పలు ఆసుపత్రులను సందర్శించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలు తీరును పరిశీలించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స సమయంలో ఎదురవుతున్న సమస్యలను ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. సన్రైజ్ హాస్పిటల్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అనంతరం అపోలో రీచ్, మెడికవర్ ఆసుపత్రులను సందర్శించి ఈహెచ్ఎస్ ద్వారా అందుతున్న సేవలపై ఉద్యోగులు, పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఈహెచ్ఎస్ సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని మారం జగదీశ్వర్ తెలిపారు. సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు టీఎన్జీవో, టీజీవో నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.










