పదవిని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉక్కుపాదం మోపింది. చేర్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా, సదరు తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
నాగపురి గ్రామానికి చెందిన శ్రీమతి జమున కనకమ్మ మరియు ఇతరులకు చెందిన భూముల నాలా (NALA) మార్పిడి ప్రక్రియను పూర్తి చేసేందుకు తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ఏకంగా రూ. 70,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుల నుంచి ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయన తన విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందాలని చూశారని పేర్కొన్నారు.
నిందితుడిని అరెస్టు చేసిన అధికారులు, విచారణ నిమిత్తం హైదరాబాద్లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెనకాడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్: 1064, వాట్సాప్: 9440446106, ఫేస్బుక్ (Telangana ACB) లేదా ఎక్స్ (ట్విట్టర్ - @TelanganaACB) ద్వారా సమాచారం అందించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏసీబీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ (QR Code) అందుబాటులో ఉందని, దాని ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలియజేశారు.


