జిల్లా కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై జాతీయ బీసీ జనసేన అధ్యక్షుడు కత్తి చంద్రశేఖర అప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన బీసీ సమాజ ఆత్మగౌరవంపై దాడిగా ఆయన అభివర్ణించారు.
తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు వద్ద, ఆటోనగర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ఐలమ్మ వంటి మహనీయుల ఆశయాలను అవమానించే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహంపై దాడి చేయడం యావత్ బీసీ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను అవమానించే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం, పోలీసు అధికారులు వెంటనే స్పందించి, ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. విగ్రహానికి తగిన రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె ఆశయాలను కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కత్తి చంద్రశేఖర అప్ప పేర్కొన్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

