కాజీపేట్, 2026-06-05
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, దర్గా పీఠాధిపతి, రాష్ట్ర చైర్మన్ కుసూర్ పాషా ల సమక్షంలో కాజీపేటలోని హజ్రత్ సయిద్ షా అఫ్జల్ బియాబాని దర్గాలో జరగనున్న ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, దర్గా పీఠాధిపతి, రాష్ట్ర చైర్మన్ కుసూర్ పాషా ల సమక్షంలో కాజీపేటలోని హజ్రత్ సయిద్ షా అఫ్జల్ బియాబాని దర్గాలో జరగనున్న ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
అధికారుల సమీక్ష, ఏర్పాట్ల పర్యవేక్షణ
ఉర్సు షరీఫ్ కు వచ్చే భక్తులకు తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్, పారిశుధ్యం, వైద్యం, పోలీసు సేవలు వంటి అన్ని రంగాల్లోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు ఆయన చెప్పారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
మత సామరస్యానికి ప్రతీకగా ఉర్సు
కాజీపేట దర్గా అన్ని కులాలు, మతాల ప్రజలను ఏకం చేసే మత సామరస్యానికి ప్రతీక అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ప్రత్యేకత అన్ని మతాల ప్రజలు సోదరభావంతో, ఐకమత్యంగా పండుగలు, ఉత్సవాలను నిర్వహించుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఉర్సు షరీఫ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తి, శాంతి, సోదరభావంతో ఉత్సవాలను నిర్వహించాలని ఆయన కోరారు.
దర్గాలో అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఏడాది దర్గాలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు దర్గా పీఠాధిపతి కుసూర్ పాషా తెలిపారు. దర్గాలో గతంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు సుమారు రూ.40 లక్షలతో నీటి సరఫరా పనులు పూర్తి చేసినట్లు, రహదారి అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
భక్తులకు అన్నదానం, ఆధ్యాత్మిక సదస్సు
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉర్సు షరీఫ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కుసూర్ పాషా తెలిపారు. దర్గా తరఫున ఆరు రోజుల పాటు సుమారు 30 వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు, నాలుగు వైపులా లంగర్ ఏర్పాటు చేసి జాయరీన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కాజీపేట దర్గా హిందూ, ముస్లిం మతాల మధ్య ప్రేమ, సోదరభావానికి కేంద్రంగా నిలుస్తోందని, ఈ సందర్భంగా అహ్లెబైత్ సందేశం మానవత్వం కోసం అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని లక్నోతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సూఫీ ప్రముఖులు, హిందూ ఆలయాల పూజారులు, బ్రాహ్మణులు, ఉలమాలు, మషాయిఖ్లు పాల్గొని మత సామరస్యం, మానవత్వం, ప్రేమ, శాంతి సందేశాన్ని అందించనున్నారని చెప్పారు.











