జిల్లా కోదాడ పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ఆవుల మల్లికార్జునరావు కిడ్నీ మార్పిడి కోసం రూ.20 లక్షలు అవసరమని, దాతల సహాయం కోసం వేడుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
నిత్యం ప్రజా సమస్యలపై కలం కదిపే ఓ జర్నలిస్ట్ నేడు తన ప్రాణాలను కాపాడుకునేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన వ్యక్తి.. ఎనిమిదేళ్లుగా కిడ్నీ వ్యాధితో పోరాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఆవుల మల్లికార్జునరావు దీనస్థితి పలువురిని కలచివేస్తోంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మల్లికార్జునరావు జర్నలిస్టుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడటంతో ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కిడ్నీ ఫెయిల్యూర్ తో ఆరోగ్యం క్షీణించడంతో పాటు, అదే సమయంలో గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కిడ్నీ మార్పిడి కోసం జీవన్‌దాన్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, గుండె సంబంధిత సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ సాధ్యం కాలేదు.
గుండె సమస్యకు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా సుమారు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గుండె ఆపరేషన్ పూర్తి చేసుకున్న ఆయనకు, ఇప్పుడు కిడ్నీ మార్పిడి రూపంలో మరో పెద్ద సవాలు ఎదురైంది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సుమారు రూ. 20 లక్షలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి ఇంతటి భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం భారంగా మారింది. మల్లికార్జునరావు తల్లి, భార్య, ఇద్దరు చిన్నారులు ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన ఆయన అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు తనపై ఆధారపడిన కుటుంబ భవిష్యత్తు ఆయనను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దాతలు, దయార్ద్ర హృదయులు స్పందించి కిడ్నీ మార్పిడి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని మల్లికార్జునరావు వేడుకుంటున్నారు.
దాతలు తమకు తోచిన సహాయాన్ని గూగుల్ పే నంబర్ 9010201870 కు లేదా ఎస్బీఐ కోదాడ మెయిన్ బ్రాంచ్ ఖాతా నంబర్ 20070785532, ఐఎఫ్ఎస్సీ కోడ్ 0006315 ద్వారా పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒక్కొక్కరి చిన్న సహాయం సైతం ఓ నిండు ప్రాణానికి అండగా నిలవగలదు. మల్లికార్జునరావుకు అండగా నిలిచి, ఆయన తిరిగి ఆరోగ్యంగా కుటుంబంతో కలిసి జీవించేలా చేయూతనివ్వాలని మానవతావాదులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి. మీ సాయం ఆయన కుటుంబానికి కొండంత ధైర్యం, ఆయన జీవితానికి కొత్త ఆశ

