హైదరాబాద్, 2026-06-05
సామాజిక దూరం, ఒంటరితనం వల్ల మనుషుల్లో మానసిక మార్పులు వస్తాయి. ఒంటరితనం అనుభవించే పురుషుల్లో మద్యం తాగే అలవాటు పెరగడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. మెదడులోని ఒక నిర్దిష్ట నాడీ మార్గం అధికంగా చురుకుగా మారడం వల్లే పురుషులు ఒంటరితనంలో ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
సామాజిక దూరం, ఒంటరితనం వల్ల మనుషుల్లో రకరకాల మానసిక మార్పులు వస్తాయని తెలిసిందే. ఒంటరితనం అనుభవించే పురుషుల్లో మద్యం తాగే అలవాటు పెరగడానికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం, మెదడులోని ఒక నిర్దిష్ట నాడీ మార్గం అధికంగా చురుకుగా మారడం వల్లే పురుషులు ఒంటరితనంలో ఎక్కువగా మద్యానికి బానిసలవుతున్నారని స్పష్టమైంది. ఈ పరిశోధనా వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైనట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
గుంపుకు దూరమైతే మద్యం వైపు
ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. పరిశోధనలో భాగంగా ఎలుకలను గుంపులుగా ఉంచి, కొన్నింటిని విడదీసి ఒంటరిగా ఉంచారు. వాటికి రోజువారీగా మంచి నీళ్లతో పాటు 15 శాతం ఆల్కహాల్ ఉన్న పానీయాన్ని అందుబాటులో ఉంచారు. సుమారు రెండు వారాల పాటు ఎలుకలు నీరు, మద్యంలో దేనిని ఎంత మోతాదులో తీసుకుంటున్నాయో పరిశీలించారు. ఈ సమయంలో ఒంటరిగా ఉంచిన మగ ఎలుకలు క్రమంగా మద్యం సేవించడాన్ని పెంచగా, ఆడ ఎలుకలు మాత్రం మద్యం వినియోగాన్ని తగ్గించినట్లు పరిశోధనలో వెల్లడైంది.
మెదడులో కీలక సర్క్యూట్ గుర్తింపు
మద్యం సేవించే సమయంలో ఎలుకల మెదడులోని బాసోలేటరల్ అమిగ్డాలా, మీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతాలను అనుసంధానించే ప్రత్యేక సర్క్యూట్‌ను పరిశోధకులు గుర్తించారు. సామాజిక ఒంటరితనంలో ఉన్న మగ ఎలుకల్లో ఈ సర్క్యూట్ అధికంగా చురుకై, మద్యం సేవించేలా ప్రేరేపించినట్లు తేలింది. ఈ బ్రెయిన్ సర్క్యూట్ నిజంగానే తాగుడుకు కారణమవుతోందా అని నిర్ధారించుకోవడానికి, ఆప్టోజెనెటిక్స్ ద్వారా ఈ సర్క్యూట్‌ను కృత్రిమంగా చురుకుగా చేశారు. అప్పుడు సాధారణంగా గుంపులో ఉన్న మగ ఎలుకలు కూడా ఒంటరితనంలో ఉన్నట్లే భావించి ఆల్కహాల్ తీసుకోవడం పెంచినట్లు గుర్తించారు. అయితే ఆడ ఎలుకల్లో మాత్రం దీనికి భిన్నంగా మద్యం వినియోగం తగ్గిందని తెలిపారు.
పరిశోధకుల అభిప్రాయం
ఒంటరితనం మద్యం సేవించే ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన కీలక ఆధారాలను అందిస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.












