అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ ప్రాంతంలో ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించారు. ఆరు రాష్ట్రాల గవర్నర్లు, 22 నగరాల మేయర్లు సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు.
వాషింగ్టన్, ఒరెగాన్, మోంటానా తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, నగర పాలక సంస్థలు దీపావళి వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయి. వాషింగ్టన్ రాష్ట్ర రాజధాని ఒలింపియాలోని స్టేట్ క్యాపిటల్ భవనంలో తొలిసారిగా దీపావళి వేడుకలు నిర్వహించారు.
మోంటానా రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ జియాన్ఫోర్టే తన అధికారిక నివాసంలో తొలిసారిగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికులు బాలీవుడ్ పాటలకు నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సియాటిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు జరిగాయి. కెంట్, టకోమా, లిన్‌వుడ్ వంటి నగరాల మేయర్లు, నగర మండళ్లు దీపావళిని గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలు విడుదల చేశాయి.
ఈ వేడుకల ద్వారా అమెరికాలోని భారతీయ సంతతి ప్రజల సాంస్కృతిక వారసత్వం, సమాజానికి వారు అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. భారత్, అమెరికా మధ్య ప్రజా సంబంధాలు మరింత బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.






