జడ్చర్ల, 12 November
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, వారి సహాయకులకు మా కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 22 వారాలుగా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ట్రస్ట్ సేవలకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే మించిన సేవ మరొకటి లేదనే నినాదంతో మా కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతి బుధవారం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణీ స్త్రీలు, వారితో పాటు వచ్చే సహాయకులకు ఉచితంగా భోజనం అందిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 22వ బుధవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, సేవాభావంతో నిర్వహించారు.
ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిళ్ల కృష్ణ (కిట్టు) గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమై 22 వారాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు భోజనం కోసం బయటకు వెళ్లి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భోజన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ సేవను ప్రారంభించడం విశేషం.
ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ట్రస్ట్ సభ్యులే స్వయంగా వంటలు తయారుచేసి, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ భోజనాన్ని సిద్ధం చేసి అందిస్తున్నారు. ఎలాంటి బయటి సహాయం లేకుండా సేవా దృక్పథంతో సభ్యులంతా సమిష్టిగా ముందుకు సాగుతున్నారు.
22 వారాలుగా ప్రతి బుధవారం క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం ద్వారా మా కృపా ట్రస్ట్ సేవా కార్యక్రమం ఎంతోమందికి అండగా నిలుస్తోంది. సేవ చేయడానికి సంపద కంటే మంచి మనసు, సమాజం పట్ల బాధ్యతాభావం ముఖ్యమని ఈ కార్యక్రమం చాటిచెబుతోంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి సమాజంలో ఆకలితో బాధపడే వారికి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.


