జగిత్యాల మండలం పొలాస, నర్సింగపూర్ గ్రామాలకు చెందిన ముస్లిం మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద స్వయం ఉపాధి కల్పన కోసం రూ.50 వేల చొప్పున చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పొలాస గ్రామానికి చెందిన యండి సైమా సమీర్, రహీమ బేగం ఖాజా మొహినోద్దీన్, నర్సింగపూర్ గ్రామానికి చెందిన అఫ్రీనా బేగం యం.డి. భాషూ లకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
స్వయం ఉపాధి ఆవశ్యకతపై ఎమ్మెల్యే సూచన
సంపన్న దేశాలలో సైతం ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని ప్రభుత్వ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
శిక్షణా కార్యక్రమాల ప్రాముఖ్యత
రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు నైపుణ్యాలను పెంచుకుని, స్వయం ఉపాధి రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ మీల్కూరి శంకర్, మాజీ జెడ్పీటీసీ పెండెం రాములు, నాయకులు శ్రీరాం భిక్షపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముఖీద్ తదితరులు పాల్గొన్నారు.

