మండలంలోని ఇటిక్యాల మూడవ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పోషణ మాసోత్సవాల సందర్భంగా, గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం తల్లులు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు శిశువుల ఎదుగుదల సక్రమంగా ఉంటుందని అధికారులు వివరించారు. అలాగే, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, పరిశుభ్రత పాటించడం, సమయానికి టీకాలు వేయించడం, రక్తహీనత నివారణకు అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వంటి అంశాలపై సలహాలు, సూచనలు అందించారు. పోషణ మాసంలో భాగంగా పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఐదో నెలలో ఉన్న గర్భిణీకి శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి టి రాజేష్, వార్డు మెంబర్ మాలాని, సెక్టర్ సూపర్వైజర్ అనూహ్య, అంగన్వాడి టీచర్ వి సువర్ణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

