మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిలను బుధవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఒక కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు సీఐ ఆంజనేయులు ఏకంగా రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నిందితుడిని రకరకాలుగా వేధిస్తూ, బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెప్పించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి ఏసీబీ
పోలీసుల వేధింపులతో విసిగిపోయిన నిందితుడు, అవినీతిని ఎదిరించాలనే ధైర్యంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
సీఐ ఆదేశాల మేరకు రూ.5 లక్షల లంచం తీసుకుంటున్న ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని కీసర చెరువుగట్టు వద్ద ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సీఐ ఆంజనేయులును కూడా అదుపులోకి తీసుకున్నారు.
అవినీతిపై కఠిన చట్టాలు తేవాలని ప్రజల డిమాండ్
ఇలా రోజురోజుకు ఎక్కడో ఒకచోట ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నప్పటికీ, అవినీతి మాత్రం తగ్గడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఏసీబీకి పట్టుబడి, రెండోసారి మళ్లీ తప్పు చేసిన అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించేలా కఠినమైన చట్టాలు తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మీ ప్రాంతంలో ఎక్కడైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే లేదా అవినీతికి పాల్పడితే నేరుగా కింద పేర్కొన్న నెంబర్ల ద్వారా ఏసీబీ అధికారులను ఆశ్రయించవచ్చు. టాల్-ఫ్రీ నెంబర్: 1064, వాట్సాప్ నెంబర్: 9440446106, ఏసీబీ హెడ్‌క్వార్టర్స్ ఫోన్ నెంబర్లు: 040-23251500 / 040-23251501. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, లంచం అడిగే అధికారులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.

