ఒక్క నెల ఈఎంఐ చెల్లింపులో ఆలస్యం అయిన వినియోగదారుల ఇళ్లకు వెళ్లి, డబ్బులు చెల్లించాలంటూ బజాజ్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్లు ఒత్తిడి చేస్తున్నారని, ఈ క్రమంలో కొందరు ఏజెంట్లు నోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. షాద్నగర్ పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
షాద్నగర్: ఒక్క నెల ఈఎంఐ చెల్లించలేదా.. ఇక ఇంటి గడప తొక్కాల్సిందేనా.. వచ్చిన వెంటనే నోటికి వచ్చినట్లు మాట్లాడాల్సిందేనా.. వినియోగదారుల పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఒత్తిడి చేయాల్సిందేనా.. ప్రస్తుతం షాద్నగర్ పరిధిలోని పలు గ్రామాల్లో బజాజ్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్ల తీరుపై వినిపిస్తున్న ఆరోపణలు ఇవే.
వినియోగదారుల ఆరోపణల ప్రకారం.. ఒక్క నెల ఈఎంఐ చెల్లింపులో ఆలస్యం కావడంతో కలెక్షన్ ఏజెంట్లు నేరుగా ఇళ్లకు వెళ్లి డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఈ సందర్భంగా కొందరు ఏజెంట్లు నోటి దురుసుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.
ఈఎంఐ అడగడం తప్పు కాదని, అయితే అడిగే పద్ధతి సరిగా ఉండాలని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క నెల చెల్లింపు ఆలస్యమైతే, వినియోగదారులతో మర్యాదగా మాట్లాడి చెల్లింపు కోసం సమయం ఇవ్వడం లేదా సంస్థ నిబంధనల ప్రకారం పరిష్కారం చూపడం సాధ్యమేనని వారు అంటున్నారు. కానీ ఇంటికే వచ్చి అవమానకరంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు నిజమైతే, దీనిపై సంస్థ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
వినియోగదారుడు అంటే కేవలం ఈఎంఐ చెల్లించే వ్యక్తేనా.. అతనికి గౌరవం ఉండదా.. అని వారు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వసూలు చేయడానికి నియమించిన కలెక్షన్ ఏజెంట్లకు వినియోగదారులతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలపై సంస్థ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందా వాటిని ఏజెంట్లు పాటిస్తున్నారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఒక్క నెల బకాయి పేరుతో ఇంటి గడప తొక్కి, మాటలతో ఒత్తిడి చేయడం కాకుండా.. సమస్యకు పరిష్కారం చూపాలని వినియోగదారులు కోరుతున్నారు. వినియోగదారుల ఆరోపణలపై బజాజ్ ఫైనాన్స్ షాద్నగర్ అధికారులు స్పందిస్తారా కలెక్షన్ ఏజెంట్ల వ్యవహారశైలిపై విచారణ చేపడతారా లేక వినియోగదారుల గోడు పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది వేచి చూడాలి.


