రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం రాయికల్ మండలంలోని జగన్నాథ్ పూర్, ఒడ్డె లింగాపూర్ గ్రామాల్లోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పాఠశాలల నిర్వహణ, ఆహారం, పారిశుధ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.
ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వసతుల కల్పనపై దృష్టి
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వంటశాలల పరిస్థితులను పరిశీలించి, అవసరమైన చోట ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుతున్నాయా, మౌలిక వసతుల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన దుప్పట్లు, ఇతర వసతులను ముందుగానే సమకూర్చాలని తెలిపారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవనాల్లో అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
నిర్మాణంలో ఉన్న భవనం పరిశీలన
అనంతరం ఉప్పుమడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి నెలలోపు భవన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పి. నరేష్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము, తహసీల్దార్ నాగార్జున, ఎంపిడివో చిరంజీవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

