తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బొడ్డెమ్మ మండలంలోని తహరాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు చిన్నారులు జరుపుకునే ఈ పండుగలో మహిళలు, బాలికలు మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి, ప్రత్యేక పూజలు చేశారు.
తహరాపూర్ గ్రామంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా, మహిళలు, చిన్నారులు మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి, దానికి పసుపు, కుంకుమ, గంధం, రంగురంగుల పూలతో అలంకరించారు. కొబ్బరికాయ, పండ్లు, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, మహిళలందరూ బొడ్డెమ్మ చుట్టూ వలయాకారంగా చేరి, బొడ్డెమ్మ బొడ్డెమ్మ కొలువైంది.. బంగారు బొడ్డెమ్మ కొలువైంది, పాపలందరూ చేరిండ్రు.. బొడ్డెమ్మను కొలిచిండ్రు అంటూ సాంప్రదాయ పాటలు ఆలపిస్తూ ఆటలు ఆడారు. గ్రామ వీధుల్లో కోలాహలంగా తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు.
బొడ్డెమ్మ పండుగ చిన్నారులలో ఐక్యత, స్నేహభావం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించే పండుగ అని అల్లం పార్వతమ్మ, కుక్కల స్వరూప, జంగిలి రమ తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని, తొమ్మిది రోజుల పాటు ఇలా బొడ్డెమ్మను ఆడిన అనంతరం చివరి రోజున సమీప చెరువులో నిమజ్జనం చేస్తారని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో తహరాపూర్ గ్రామానికి చెందిన మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలు గ్రామంలో సందడిగా సాగాయి.


