సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టీల పేరుతో వందలాది మందిని మోసం చేసి, కోట్లు వసూలు చేసి కుటుంబంతో సహా పరారైన ఘటన కలకలం రేపుతోంది. నమ్మకంతో తమ కష్టార్జితాన్ని ఇచ్చిన బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా మండలం ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు, ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మొదట్లో వ్యాపారాల్లో నష్టపోయిన రాజు, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో చిట్టీల దందాకు తెరలేపాడు. తన భార్య అనూష సహకారంతో సూర్యాపేట రూరల్, పరిసర ప్రాంతాల్లో చిట్టీల వ్యాపారం, డైలీ కలెక్షన్లు ప్రారంభించాడు. స్థానికుల నుండి ప్రతిరోజూ రూ.2 లక్షల వరకు డైలీ కలెక్షన్లు, అప్పుల రూపంలో వసూలు చేసేవాడు. కొద్ది రోజుల పాటు చిట్టీల వ్యాపారం సజావుగానే సాగింది. నెలనెలా డబ్బులు వసూలు చేయడం, పాట పాడుకున్న వారికి నమ్మకంగా డబ్బులు ఇవ్వడంతో వ్యాపారం మరింత పెరిగింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా లక్షలాది రూపాయల విలువైన పలు చిట్టీలను నడిపాడు. ప్రభుత్వ టీచరే కదా, ఎక్కడికి పోతాడు అనే నమ్మకంతో తోటి ఉద్యోగులు, వ్యాపారులు, అమాయక తండా ప్రజలు తమ కష్టార్జితాన్ని రాజుకు అప్పగించారు. అయితే, చిట్టీల గడువు పూర్తికావడంతో, బాధితులు పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
బాధితుల ఒత్తిడితో రాజు అసలు రంగు బయటపడింది. బాధితులకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా పరారయ్యాడు. తాము కష్టపడి దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి కదా.. ఎక్కడికి పోతాడు అని నమ్మాం, మా పిల్లల పెళ్లిళ్ల కోసం దాచిన డబ్బును ఇలా ముంచేస్తాడనుకోలేదు అని కొందరు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. చివరకు బాధితులంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, బాధితుల వివరాలు, చిట్టీలకు సంబంధించిన లెక్కలు, నగదు ఎక్కడికి వెళ్లిందన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

