జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వర్ణకుమారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సీజ్ చేసిన ఫిజియోథెరపీ కేంద్రం తాళాలు తిరిగి ఇచ్చేందుకు, ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, కొత్త లైసెన్స్ జారీ చేయడానికి ఆమె రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.
ప్రభుత్వంలో ఎంతటి ఉన్నతాధికారులైనా, నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నా సరే కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదు. ప్రజలకు సేవ చేయాల్సిన స్థానంలో ఉండి, హక్కుగా రావలసిన అనుమతులు, పనుల కోసం లంచాలు డిమాండ్ చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోతున్నారు. తాజాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, జిల్లాకు చెందిన ఓ ఫిర్యాదుదారుని ఫిజియోథెరపీ కేంద్రాన్ని అధికారులు గతంలో సీజ్ చేశారు. ఆ కేంద్రం తాళాలు తిరిగి ఇచ్చేందుకు, అతనిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, అలాగే కొత్త లైసెన్స్ జారీ చేయడానికి డాక్టర్ స్వర్ణకుమారి రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. తాము అంత మొత్తాన్ని ఇచ్చుకోలేమని బాధితుడు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు వినకపోవడంతో, ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు. పథకం ప్రకారం శివరాంపల్లిలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో రూ. 1,00,000 ఒక లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి డాక్టర్ స్వర్ణకుమారిని, ఆమెకు సహకరించిన హెల్త్ ఇన్స్పెక్టర్ . శ్రీనివాస్‌ను, ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడి అనంతరం శివరాంపల్లిలోని కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ అధికారులు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట లంచగొండి అధికారులను పట్టుకుంటూనే ఉన్నారు. కోర్టులు, జైలు శిక్షలు, ఉద్యోగాలు ఊడిపోవడం వంటి పరిణామాలు కళ్లముందే కనిపిస్తున్నా కొందరు అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. సామాన్యుల నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వమ్ము చేస్తూ, ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజలకు అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారి అయినా, ఉద్యోగి అయినా మీ వద్ద నుండి పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే భయపడకండి. వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించండి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్: 1064, వాట్సాప్ / హెల్ప్‌లైన్ నెంబర్: 9440446106. అవినీతి రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత. లంచం అడిగే అధికారుల గుట్టురట్టు చేసి, తగిన బుద్ధి చెప్పడానికి ధైర్యంగా ముందుకు రండి

