సైబర్ నేరాలపై అందే ప్రతి ఫిర్యాదుకు తక్షణమే స్పందించి, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ నేరాల దర్యాప్తు, కేసుల పురోగతిపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నిందితుల గుర్తింపు, అరెస్టులు, బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఎస్పీ సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ కేసులను సీఐలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులను గుర్తించేందుకు ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుని, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. . . . అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అనుమానాస్పద కాల్, సందేశం, లింక్ లేదా ఆన్లైన్ ఆఫర్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా ఆగి, ఆలోచించి, అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించిన తర్వాతే చర్య తీసుకోవాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, అలాగే .. ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీఐలు రామ్ నరసింహారెడ్డి, సుధాకర్, కరుణాకర్, సురేష్ బాబు, లక్ష్మీ నారాయణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, సైబర్ క్రైమ్ ఎస్ఐలు కృష్ణ, దినేష్ మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.


