రాయికల్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డ్ అంగన్వాడి కేంద్రం , రాయికల్ 01 అంగన్వాడి కేంద్రం సంయుక్తంగా పోషణ మాసం వేడుకలను నిర్వహించాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పట్టీలు, బెల్లం ఉండలు వంటి అందుబాటులో ఉన్న పోషకాహారం తీసుకోవాలని సూచించారు. వైద్యులు సూచించిన ప్రకారం ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులను క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు. హిమోగ్లోబిన్ స్థాయి 11 గ్రాముల కంటే తక్కువ ఉంటే హై రిస్క్‌గా పరిగణిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని గర్భిణీలకు సూచించారు. డెలివరీ తర్వాత తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని, వీటిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అవగాహన కల్పించారు. పిల్లలకు అన్ని టీకాలు సకాలంలో ఇప్పించాలని, ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు అంగన్వాడి సెంటర్‌కు వచ్చి పిల్లల ఎత్తులు, బరువులు నమోదు చేయించాలని సూచించారు. 6 నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఎగ్స్ (గుడ్లు) 16, బాలామృతం 2.5 కిలోలు, అదనపు ఆహారం అందించడం గురించి వివరించారు. తల్లిపాలు కచ్చితంగా రెండు సంవత్సరాల వరకు ఇవ్వాలని, 3 ప్లస్, 4 ప్లస్ వయస్సు పిల్లలను అంగన్వాడి సెంటర్లో నమోదు చేసి, కేంద్రానికి పంపించాలని తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లలకు ఆటపాటలతో పాటు సంసిద్ధత, సృజనాత్మకత, మంచి అలవాట్లు, సంభాషణ, కథల ద్వారా విద్యను నేర్పించడం జరుగుతుంది. అలాగే, పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించారు. ఈ సందర్భంగా (ప్రధానమంత్రి మాతృ వందన యోజన) పథకంపై గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, హెల్త్ సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు ఎలిగేటి రజిత, సుమలత, వనిత, రాధిక, సింధూరి, పుష్పలత, తల్లులు, పిల్లలు, ఆయాలు, కిశోర బాలికలు, ఇతరులు పాల్గొన్నారు.

