ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో, నిరసనకారులను అక్రమంగా నిర్బంధించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతించాలని, మెట్రో, రైల్వే, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించరాదని ఆదేశించింది. ప్రజా శాంతి పేరుతో ప్రాథమిక హక్కులను నిరోధించలేమని పేర్కొంది.
ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మొహనాలతో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు పరిసరాల్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలిపే బోర్డును తొలగించాలని, ఇప్పటికే తొలగించకపోతే వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించింది. న్యాయస్థానాలకు చేరుకోవడంలో ప్రజలకు ఎలాంటి భయాందోళనలు ఉండకూడదని స్పష్టం చేసింది.
ఆర్జెడి రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో సెక్షన్ 163 అమలులో ఉన్న ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల పరిధి వెలుపల ఉన్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రైళ్లలో ప్రయాణిస్తున్నవారిని సైతం పోలీసులు ఎత్తుకెళ్తున్నారని, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించారని, శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ 45 మెట్రో స్టేషన్లు మూసివేశారని తెలిపారు. సీనియర్ న్యాయవాది షదన్ ఫరాసత్ కూడా నిరసన సందర్భంగా తాను పోలీసుల దాడికి గురయ్యానని కోర్టుకు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును రాజధానిలో దెబ్బతీశారని, పౌరుల శాంతియుత నిరసన హక్కును పునరుద్ధరించాలని కోరారు.
బారికేడ్లను సమీక్షించాలి
ఢిల్లీలో ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న బారికేడ్లను వెంటనే సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలకు లోబడి నగరంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించాలని పేర్కొంది.

