ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొని ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో డివైడర్ను ఢీకొని పూర్తిగా తగలబడిపోయిన ఈవీ () కారులో మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నంబూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులు నున్న, నంబూరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, మరో చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు నంబూరులో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












