ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతో పాటు, డబ్బుల కోసం ఏదైనా చేయాలనే తెగింపుతో సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ ఒక చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణానికి విక్రమ్ స్థానికంగా పనిచేసే మరో సెక్యూరిటీ గార్డ్, ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకున్నాడు. పాపను కిడ్నాప్ చేసిన తర్వాత, విక్రమ్ మరో సెక్యూరిటీ గార్డ్ ఫోన్ నుంచి పాప తండ్రికి కాల్ చేసి, ఇరవై లక్షలు డిమాండ్ చేశాడు.
అయితే, బతుకమ్మ వేడుకలు జరుగుతున్నందున, కమ్యూనిటీలో అందరూ బయటకు రావడంతో దొరికిపోతామని భయపడిన విక్రమ్, అతనికి సహకరించిన ఇద్దరితో కలిసి చిన్నారిని హతమార్చాడు. ప్రధాన హంతకుడైన విక్రమ్ బాలికను హత్య చేయగా, ఎలక్ట్రీషియన్ పాప అరుపులు బయటకు వినపడకుండా బతుకమ్మ పాటల సౌండ్ పెంచాడు. మరో సెక్యూరిటీ గార్డ్ ఎవరూ అక్కడికి రాకుండా కాపలా కాశాడు.
విక్రమ్ ప్రవర్తన సరిగా లేదని వారం క్రితమే విల్లా కమ్యూనిటీ యజమానులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ కక్షతోనే చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆమె తండ్రిని డబ్బులు డిమాండ్ చేసేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారి తండ్రికి డబ్బులు అడిగిన ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు, ఆ ఫోన్ మరో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్‌కు సహకరించిన మరో సెక్యూరిటీ గార్డు, ఎలక్ట్రీషియన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

