భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన మేరీ పంచాయత్ యాప్, గ్రామ పాలనలో పారదర్శకతను పెంచుతూ సామాన్యులకు సాధికారత కల్పిస్తోంది. వినియోగదారులు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకుని, తమ గ్రామానికి సంబంధించిన నిధులు, ఖర్చులు, అభివృద్ధి పనుల పురోగతిని సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ యాప్‌లో లాగిన్ అవ్వడానికి వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్, ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని, భద్రత కోసం పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి. మీ గ్రామాన్ని ఎంచుకుంటే, సర్పంచ్, కార్యదర్శి వివరాలతోపాటు పంచాయతీకి వచ్చే నిధులు, ఖర్చులు, అభివృద్ధి పనుల పురోగతిని తెలుగులోనే సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంచాయతీ ఖాతాలో ప్రస్తుతం ఉన్న నగదు నిల్వ, ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామానికి అందిన మొత్తం నిధులు, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ పనుల కోసం చేసిన ఖర్చుల తేదీల వారీ వివరాలు, వివిధ పథకాల కింద జరిగిన ఖర్చులను ఆర్థిక సంవత్సరాలవారీగా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేసే సౌలభ్యం కూడా ఈ యాప్‌లో ఉంది.
మేరీ పంచాయత్ యాప్‌తో నిధుల కేటాయింపు నుంచి పనుల పూర్తి వరకు ప్రతి దశ డిజిటల్ రూపంలో శాశ్వతంగా నమోదు కావడం వల్ల భవిష్యత్తులో జరిగే ఆడిటింగ్ ప్రక్రియలకు ఇది ఒక బలమైన సాక్ష్యాధారంగా మారుతుంది. పనుల నాణ్యతలో లోపాలు ఉన్నప్పుడు భౌగోళిక గుర్తింపు కలిగిన ఛాయాచిత్రాలతో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటం వల్ల వ్యవస్థాగత కుమ్మక్కును అరికట్టడానికి ఈ డిజిటల్ సాక్ష్యం తిరుగులేని ఆయుధంగా మారుతుంది. ప్రతి పైసా ఖర్చుకు సాక్ష్యాలు ప్రజల ముందు ఉండటం వల్ల పరిపాలనలో జవాబుదారీతనం దానంతట అదే పెరుగుతుంది. ఇది కేవలం పర్యవేక్షణ మాత్రమే కాదు, అధికారులపై ఉండే చట్టబద్దమైన ఒత్తిడి. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను పటిష్టం చేశారు.












