పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. ఇది వ్యవసాయం, నీటి వనరులు, మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని అంచనా.
సూర్యాపేట జిల్లా నడిగూడెం కే ఎల్ ఎన్ గౌట్ జూనియర్ కళాశాల జూనియర్ లెక్చరర్ చారగొల్ల కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగే ఒక సహజ వాతావరణ పరిస్థితి. ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం, గాలులు వీచే దిశ, వ్యవసాయ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తాయి. స్పానిష్ భాషలో ఎల్ నినో అనగా బాలుడు అని అర్థం. దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్రంలో క్రిస్మస్ సమయానికి సముద్ర జలాలు వేడెక్కడాన్ని గమనించడంతో, బాల యేసు గుర్తుగా క్రిస్మస్ సాంప్రదాయంలో ఎల్ నినోను బాలుడు అని భావిస్తారు. ఎల్ నినో ఏర్పడే సమయంలో గాలులు బలహీనపడతాయి, ఫలితంగా మధ్య తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ మార్పులు వాతావరణ ప్రసరణను ప్రభావితం చేసి, వివిధ దేశాలలో వర్షాలు, కరువులు, వేడి గాలులు వంటి పరిస్థితులను మార్చగలవు.
ఎల్ నినో వలన వ్యవసాయ రంగంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాల దిగుబడులు తగ్గుతాయి. పంటలకు నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రైతులకు ఆదాయం తగ్గి, అప్పుల భారం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఎల్ నినో మానవ జీవన విధానంపై ప్రభావం చూపుతుంది. దీనివలన తాగునీటి కొరత ఏర్పడుతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది కానీ ఉత్పత్తి మాత్రం తగ్గుతుంది. ఆహార పదార్థాల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుంది. అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు, నీటి వనరులు తగ్గిపోతాయి, సముద్ర జీవావరణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ప్రపంచ వాతావరణ సంస్థ 2020లో విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2026 చివరి నెలలో ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేయడమైనది. ప్రాంతాన్ని బట్టి ఎల్ నినో ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక వేడి వలన నీరసం, డిహైడ్రేషన్ వంటి సమస్యలు అధికంగా సంభవించే అవకాశం కలదు. ఎల్ నినో నుండి కాపాడుకోవడానికి రైతులు పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలి. తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవాలి. స్థానిక పరిస్థితులకు అనుకూలంగా విత్తనాలను ఎంచుకోవాలి. నీటిని ఆదా చేయడానికి బిందు సేద్యం, తుంపర సేద్యం ఉపయోగించాలి. పొలాలలో వర్షపు నీటిని నిల్వ చేసుకునే ఏర్పాట్లను చేసుకోవాలి. నేలలో తేమను కాపాడేందుకు పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచాలి. పంటల బీమా, ప్రభుత్వ వ్యవసాయ సలహాలను పరిగణలోకి తీసుకోవాలి. వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించడం, చెరువులు, కుంటలు, జలాశయాలను సంరక్షించడం వంటి చర్యలు చేపట్టాలి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. వేడిగాలుల సమయంలో తగినంత నీరు తాగాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉండే సమయమున బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. వడదెబ్బ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వాతావరణ శాఖ యొక్క అధికారిక సమాచారాన్ని అనుసరిస్తూ పంటలను కాపాడుకోవాలి. నీటి సంరక్షణ, అటవీ పరిరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, విపత్తులపై ముందస్తు అవగాహన ద్వారా ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణాన్ని కాపాడడం, ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి.












