వాతావరణంలో వచ్చే మార్పులను, భూమిలో జరిగే అలజడిని కొన్ని చెట్లు, జంతువులు, కీటకాలు మనకంటే నెలల ముందే పసిగట్టగలవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరువు, వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను సూచించే మొక్కలు, జీవుల ప్రవర్తనపై సమగ్ర విశ్లేషణ వెలువడింది.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మండల కేంద్రం నుంచి ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే చెట్లు, ప్రకృతిలో కనిపించే సూచనలపై సీనియర్ జర్నలిస్ట్ ఏనుగుల వీరాంజనేయులు అందించిన విశ్లేషణ ప్రకారం, ప్రకృతి మనతో నిరంతరం సంభాషిస్తుందని, దాని భాషను అర్థం చేసుకోవడం మన బాధ్యత అని తెలిపారు. కొన్ని జీవులు, మొక్కలు వాతావరణ మార్పులను, భూమిలో జరిగే అలజడిని ముందుగానే పసిగట్టగలవని, ఎందుకంటే వాటి మనుగడ దానిపైనే ఆధారపడి ఉంటుందని వివరించారు.
కరువును, ఎల్ నినోను ముందే చెప్పే చెట్లు
కరువును సూచించడంలో నేరేడు చెట్టు కీలక పాత్ర పోషిస్తుంది. దీని వేర్లు 60-80 అడుగుల లోతు వరకు వెళ్తాయి. భూగర్భ జలాలు తగ్గగానే, చెట్టు కొత్త ఆకులు, కొమ్మలు పెంచడం ఆపి, ఉన్న శక్తిని పూత, పిందె, కాయల ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నేరేడు చెట్టు నిండా కాయలు కాసినా, కాయ సైజు చిన్నగా ఉంటే, ఆ ఏడాది కరువు వచ్చే సూచన. దీనిని స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు.
చింత చెట్టు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. సాధారణంగా ఉగాది తర్వాత చిగురించే ఈ చెట్టు, కరువు రాబోతుంటే ఉగాదికి ముందే లేత చిగురు, పూత ఒకేసారి వేస్తుంది. భూమిలో నీటి మట్టం 100 అడుగుల లోతున తగ్గినప్పుడు, చెట్టు విత్తనాల ఉత్పత్తిని పెంచుతుంది.
వేప చెట్టు కరువు ముందు డిసెంబర్, జనవరిలోనే నిండా పూస్తుంది. అయితే, ఆ సంవత్సరం వేప గింజల్లో నూనె శాతం తక్కువగా ఉంటుంది. చెట్టు నీటిని ఆదా చేసుకోవడమే దీనికి కారణం. పూర్వీకులు వేప పూతను చూసి వర్షాలపై అంచనా వేసేవారు.
తుమ్మ చెట్టు నీటి ఎద్దడి రాగానే ఆకులన్నీ రాల్చేస్తుంది. ఆకులుంటే నీరు ఆవిరైపోతుందని, తనను తాను కాపాడుకోవడానికి ముళ్ళతో మిగిలిపోతుంది. అదే సమయంలో నిండా కాయలు కాస్తుంది. తుమ్మ చెట్టు ఇలా మారితే, ఆ ప్రాంతంలో రాబోయే 6 నెలలు వర్షాభావం తీవ్రంగా ఉంటుందని అర్థం.
వరదలు, అతివృష్టిని ముందే చెప్పే చెట్లు
మర్రి చెట్టు వరదలకు ముందు విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దాని ఊడలు నేలను తాకకముందే విపరీతంగా పెరిగి, వేగంగా నేలలోకి దిగబడిపోతాయి. భూమిలో తేమ శాతం 80 దాటి, గాలిలో నీటి ఆవిరి ఎక్కువైతే, చెట్టు అదనపు తేమను పీల్చుకోవడానికి ఊడలను సిద్ధం చేస్తుంది. వరద రావడానికి నెల ముందు ఈ మార్పు మొదలవుతుంది.
భారీ వర్షాలు రాబోతున్నాయని తెలియగానే కొబ్బరి చెట్టు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి. కాయలు లావుగా, నిండా నీళ్ళతో తయారవుతాయి. ఇది చెట్టు నీటిని నిల్వ చేసుకోవడం మొదలుపెట్టిందని సూచిస్తుంది.
వెదురు పూత ఒక అద్భుతమైన సూచిక. సాధారణంగా 40-50 ఏళ్లకు ఒకసారి పూసే వెదురు, ఒక అడవిలో అంతా ఒకేసారి పూసి చనిపోతే దాన్ని గ్రెగేరియస్ ఫ్లవరింగ్ అంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా వెదురు పూత వచ్చిన 1-2 ఏళ్ళలో భయంకరమైన వర్షాలు, వరదలు వస్తాయని నమ్ముతారు. 2006లో మిజోరంలో వెదురు పూత తర్వాత వరదలు బీభత్సం సృష్టించాయి.












