తెలంగాణలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ () ద్వారా బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ వంటి నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీపై అందించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం మాత్రమే అందిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి ముఖ్యమైన నిత్యావసర సరుకులను కూడా రాయితీ ధరకు అందించే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చు, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.
మంత్రి సమీక్ష
ఈ కీలక ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనలోని వివిధ అంశాలపై చర్చించి, తదుపరి చర్యలకు మార్గనిర్దేశం చేశారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక
భవిష్యత్తులో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా మార్కెట్లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 14 నెలలకు సరిపడా ఆహార ధాన్యాల బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
త్వరలో తుది నిర్ణయం
సరుకుల సేకరణ, పంపిణీ విధానం, ఒక్కో కుటుంబానికి అందజేసే పరిమాణం, దీనివల్ల ప్రభుత్వానికి అయ్యే ఆర్థిక భారం వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి తనకు సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.












