మండలం పాలమాకుల గ్రామానికి చెందిన ఎం. అక్షయ రాష్ట్రస్థాయి మూడు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో కాంస్య పతకం సాధించి తన పాఠశాలకు కీర్తి తెచ్చింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి అర్హత సాధించింది. ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె ఈ విజయం సాధించింది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం క్రీడారంగంలో తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో మెరిసిపోతున్నారనేందుకు కాకునూరు గ్రామానికి చెందిన విద్యార్థిని ఎం. అక్షయ సాధించిన విజయం నిదర్శనంగా నిలుస్తోంది. మండలం పాలమాకుల గ్రామంలోని ఎంజేపీటీ రాజేంద్రనగర్ బ్రాంచ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అక్షయ రాష్ట్రస్థాయి మూడు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో కాంస్య పతకం సాధించి పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చింది.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ మూడు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో అక్షయ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. బుధవారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మూడు కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారిణులతో పోటీపడి మూడో స్థానాన్ని సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
నాన్న ధైర్యం అమ్మ ఆశయం నా విజయానికి బాటలు
ఈ సందర్భంగా అక్షయ మాట్లాడుతూ.. నాన్న ఇచ్చిన ధైర్యం, అమ్మ ఆశయమే నా విజయానికి ప్రధాన కారణం. ఎక్కడైనా, ఎప్పుడైనా పోటీకి సిద్ధమే. నా జీవితంలో ఈ పరుగు పందెం పోటీలు తొలి ప్రస్థానం. మొదటిసారిగా పరుగు పందెంలో పాల్గొని, రాష్ట్రస్థాయిలో ఎంతో అనుభవం ఉన్న క్రీడాకారిణులతో పోటీపడటం నాకు గొప్ప అనుభూతిని కలిగించింది. ఈ విజయం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భవిష్యత్తులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడానికి మరింత కష్టపడతాను అని అక్షయ ధీమా వ్యక్తం చేసింది.
అక్షయపై అభినందనల వెల్లువ
విద్యార్థిని అక్షయ రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించడంపై పాఠశాల ప్రిన్సిపల్ జి. అనిత, పీడీలు జి. స్వప్న, బి. శ్రావ్య, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థినులు, కాకునూరు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జాతీయస్థాయిలోనూ పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.












