రంగారెడ్డి, 12 November
డిగ్రీ కళాశాలలకు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్), స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని టీపీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్ గౌరీ సతీష్, చేవెళ్ల ఇన్చార్జి భీమ్ భరత్, టీజీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ముగ్గురు ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్), విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధించిన బకాయిలు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. కళాశాలల నిర్వహణ, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు, ఇతర విద్యా సంబంధిత ఖర్చుల నిర్వహణ కష్టతరంగా మారిందని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, బకాయిల విడుదలలో జాప్యం విద్యార్థుల చదువులతో పాటు కళాశాలల నిర్వహణపై కూడా ప్రభావం చూపుతోందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును, ఉన్నత విద్యా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసేలా ముఖ్యమంత్రి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించాలని కోరారు.
ప్రతినిధుల విజ్ఞప్తిపై వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన సానుకూల హామీతో డిగ్రీ కళాశాలల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు.


