జగిత్యాల, 2026-11-21
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, గత ఆరు సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, గత ఆరు సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే, జగిత్యాల జిల్లాలో మొత్తం 18,955 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 11,516 మంది లబ్ధిదారులకు మాత్రమే పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. అంటే, 7,439 మందికి పింఛన్ మంజూరు కాకపోవడం విచారకరం. వీరిలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, ఫైలేరియా బాధితులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు. వీరిలో 7,439 మందికి పింఛన్ మంజూరు కాకపోవడం, ముఖ్యంగా దాదాపు 2,300 మంది చేనేత కార్మికులు ఉండటంతో, కష్టజీవులైన చేనేత కార్మికులకు పింఛన్ మంజూరు కాకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా దరఖాస్తు చేసుకున్న చేనేత కార్మికులందరికీ పింఛన్ మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, వారి అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ తెలిపారు.
అదేవిధంగా, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కాలం చెల్లడంతో తిరిగి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారికి కొత్త సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో ఆలస్యం కావడంతో వారికి పింఛన్ లభించలేదు. వారికి సదరం సర్టిఫికెట్లు ఇచ్చి వారందరికీ కూడా పింఛన్ మంజూరు చేయాలని కోరారు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు కూడా అర్హులైనప్పటికీ పింఛన్ మంజూరు కాకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారి ఆశలను నెరవేర్చి, వారి కుటుంబాలకు ఆసరా కల్పించాలని పింఛన్ దారులందరి పక్షాన తన విజ్ఞప్తిని తెలియజేశారు. పింఛన్ మంజూరు కాకపోవడానికి గల కారణాలను తెలియజేయకుండా, ఆన్లైన్లో రికార్డు లేదు అని చూపడంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. కావున, వెంటనే నిలిపివేసిన పింఛన్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేసి వారి ఆందోళనను తగ్గించాలని కోరారు.



