ఖమ్మం, జులై 15
భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్-2026లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన ఖమ్మం పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజేతలను అభినందిస్తూ, వారు పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు.
ఇటీవల జరిగిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్-2026లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ఆయన అభినందిస్తూ, పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు.
జులై 7 నుండి 9 వరకు వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్-2026 నిర్వహించారు. ఈ పోటీల్లో వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ వంటి వివిధ విభాగాల్లో వీరు తమ వృత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు.
వి. ఉదయ్ కుమార్ (టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్): ఫోరెన్సిక్ సైన్స్, చట్టం & దర్యాప్తు రాత పరీక్షలలో రెండు బంగారు పతకాలు, వేలిముద్రల ప్రాక్టికల్ పరీక్షలో కాంస్య పతకం సాధించి సత్తా చాటారు. వి. దివ్య (కూసుమంచి ఎస్సై): వైద్య-న్యాయ పరిశీలన పరీక్షలో రజిత పతకం, ఫోరెన్సిక్ సైన్స్ రాత పరీక్షలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎం. మహేష్ (ఏ ఆర్ కానిస్టేబుల్): యాక్సెస్ కంట్రోల్ పరీక్షలో కాంస్య పతకం సాధించారు. పి. కిరణ్ (ఏ ఆర్ కానిస్టేబుల్): డాగ్ స్క్వాడ్ పోటీలో కాంస్య పతకం దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. జోనల్ స్థాయిలో కనబరిచిన ఇదే పట్టుదల, ప్రతిభను రాష్ట్ర మరియు జాతీయస్థాయి పోటీల్లో కూడా ప్రదర్శించి మరిన్ని పతకాలు సాధించాలని అధికారులను ప్రోత్సహించారు. నిరంతర సాధన, వృత్తి పట్ల అంకితభావమే అధికారులను విజేతలుగా నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు.









