ధర్మపురి, 12 July
మనిషిలో మానవత్వం కరువై, డబ్బుకే పెద్ద పీట వేస్తున్న నేటి సమాజంపై ఈ కథనం విశ్లేషిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కనిపించే మానవత్వం, నిజ జీవితంలో కనుమరుగవుతోందని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణం లోపిస్తోందని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు.
పెదవులపై మానవత్వం, సామాజిక మాధ్యమాల్లో లైకులు.. చేతల్లో మాత్రం స్వార్థం, రూపాయి చుట్టూ ఇహలోకాలు తిరుగుతున్నాయి. కన్నీరు కార్చి కష్టాలు చెబితే వినే ఓపిక నటిస్తున్నారు కానీ, కరిగే హృదయాలు కరువైన కాలమిది. నీ వస్తువును అమ్ముకుని కష్టం నుండి గట్టెక్కాలని చూస్తే, లాభనష్టాల లెక్కలు వేస్తూ నీ బాధను బేరమాడుతారు. కనీస సాయం చేసేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు.
డబ్బుకున్న విలువ ఇక్కడ మనిషి ప్రాణానికి లేదు. ప్రాపర్టీకి ఉన్న ప్రాధాన్యత ఎదుటివాని కన్నీటికి లేదు. వందలో ఒక్కడు నిలిచినా, మిగతా లోకం స్వార్థంతోనే నిండి ఉంది. మధ్యతరగతి గుండె గోస వినే నాథుడే లేడు.
నీ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోకు, నీ కన్నీటిని బజార్న పెట్టకు. ఇక్కడ ఎవరూ కరిగిపోరు, నీకు తోడు రారు. లైకులు, కామెంట్ల వెనుక ఉన్నదంతా అబద్ధపు లోకం. నిజ జీవితంలో మానవత్వం కేవలం ఒక మృగతృష్ణ. రానున్న రోజులు ఇంకా దారుణం.. మనుషులు ఇంకా యంత్రాలుగా మారతారు. డబ్బు మాత్రమే దేవుడైన చోట బంధాలన్నీ బందీలు. నీ బాధ నీదే, నీ పోరాటం నీదే.. గుండె నిబ్బరంతో బతుకును నెట్టుకురావడమే ఇక నీ దారి!







