శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో తమ పార్టీకి చెందిన రాజ్యసభ సీటును పవార్‌కు వదులుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఎన్సీపీ (ఎస్పీ) నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కారు.
మహారాష్ట్రలో ఏడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, ఒక అభ్యర్థి గెలుపునకు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, ఎన్సీపీ (ఎస్పీ)కి కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 16 మంది, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, శరద్ పవార్ రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ తన సీటును త్యాగం చేసిందని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తెలిపింది.
సుప్రియా సూలే స్వయంగా కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి మద్దతు కోరారని, అప్పుడు తమ పార్టీకి మద్దతు లభించిందని కాంగ్రెస్ పేర్కొంది. అలాంటిది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఇవ్వడం తమకు ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు జితేంద్ర అవ్హాద్, శరద్ పవార్‌తో చర్చల అనంతరం, దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలనే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని నవంబర్ 27న ప్రకటించారు. ఈ పరిణామం మహా వికాస్ అఘాడీతో పాటు, ఇండియా కూటమిలోనూ రాజకీయ విభేదాలకు దారితీసింది.


