రాయికల్, 2026-08-25
రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విస్డం హైస్కూల్ విద్యార్థులు మంగళవారం హెల్తీ లైఫ్ స్టైల్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్ లెడ్ మూమెంట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శనలు, నాటకాలతో ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు.
రాయికల్ పట్టణంలోని విస్డం హైస్కూల్ కు చెందిన ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు మంగళవారం రోజున స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. స్టూడెంట్ లెడ్ మూమెంట్ (ఎస్ఎల్ఎం) కార్యక్రమంలో భాగంగా హెల్తీ లైఫ్ స్టైల్ అనే అంశంపై విద్యార్థులు పలు ప్రదర్శనలు, నినాదాలు, డిబేట్స్, నాటకాల ద్వారా అవగాహన కల్పించారు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై సూచనలు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మెడికల్ ఆఫీసర్ డా. శశికాంత్ రెడ్డి, అనస్తీషియా డా. శ్రీకాంత్ లు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుందన్నారు. మన పరిసరాల్లో లభించే పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా మన ఆహారంలో భాగం చేసుకోవాలని తెలిపారు.
యాజమాన్యానికి అభినందనలు
ప్రైమరీ పిల్లలు స్టేజి ఫియర్ లేకుండా మాట్లాడటం, పలు ప్రదర్శనలు ఇచ్చేలా శిక్షణ ఇప్పించిన పాఠశాల యాజమాన్యాన్ని డాక్టర్లు అభినందించారు.
రాఖీ పండుగ స్ఫూర్తితో సంకల్పం
అనంతరం విద్యార్థులు పలువురు డాక్టర్లకు, సిబ్బందికి, రోగులకు ముందస్తు రాఖీలు కడుతూ మేము మీకు రక్ష... మీరు మాకు రక్ష... మనందరం ముప్పు పదార్థాలు లేని ఆరోగ్యవంతమైన భారతదేశానికి రక్ష అని సంకల్పం చెబుతూ రాఖీలు కట్టారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు.
ప్రయోగాత్మక విద్య ఆవశ్యకత
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎ. ఎమ్ .రాజు రెడ్డి మాట్లాడుతూ, తరగతి గదుల్లో బోధించిన పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి ప్రతి సంవత్సరం ఎస్ఎల్ఎం మరియు ఎస్ఎల్సి (స్టూడెంట్ లెడ్ కరికులం) కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే విద్యార్థుల్లో సర్వాంగీణ వికాసం జరుగుతుందని తెలిపారు.
పాల్గొన్న వైద్యులు
ఈ కార్యక్రమంలో స్త్రీల వ్యాధి నిపుణురాలు డా. రజిత, చర్మవ్యాధి నిపుణురాలు డా. సుదక్షణాదేవి, డా. సాయి సుధా, డా. మానస, డా. అనిల్, డా. సింధూజ, డా. మణి చంద్ర తదితరులు పాల్గొన్నారు.












