సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు చేయూతనిచ్చే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక రుణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అందుబాటులో ఉన్న రుణ పథకాలపై సమగ్ర సమాచారం అందించారు. వరి మిల్లులు, పప్పు ధాన్యాల మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు, పౌల్ట్రీ ఫారాలు వంటి పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక సహాయం పొందే మార్గాలను వివరించారు.
సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే వ్యవసాయ క్లస్టర్ల ఆధారంగా రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో, 39 జిల్లాల్లోని 306 శాఖలను తొమ్మిది కీలక వ్యవసాయ రంగాలతో అనుసంధానించింది. ఉత్పత్తి దశ నుంచి తుది వినియోగదారుడి వరకు వ్యవసాయ విలువ గొలుసులో భాగమైన అన్ని కార్యకలాపాలకు ఆర్థిక చేయూత అందించడమే బ్యాంకు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

