తెలంగాణలో కరువు ఛాయలు అలుముకుంటున్న వేళ, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్కు మాత్రం వందల ఎకరాల్లో పచ్చదనం కళకళలాడుతోంది. పాండురంగ చెరువు నుంచి నీటిని మళ్లించడానికి ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎర్రవల్లి మోడల్ విలేజ్ పేరుతో ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ ఎల్నినో ప్రభావంతో వానలు లేక, చెరువులు, డ్యామ్లు, రిజర్వాయర్లు, బోర్లన్నీ ఇంకిపోయి కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. గుక్కెడు తాగునీటికి కూడా ప్రజలు అల్లాడుతున్న ఈ సమయంలో, ఒక ప్రాంతం మాత్రం నిండుకుండలాంటి బాయిలు, గలగలపారే కాల్వలు, పైపులైన్లతో వందల ఎకరాల్లో పచ్చదనంతో కళకళలాడుతోంది. సహజంగా జరిగితే అదొక అద్భుతం అనుకోవచ్చు. కానీ, పదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని, వందల కోట్ల ప్రజాధనంతో ఒక వ్యక్తి తన సొంతానికి చేసుకున్న ఏర్పాటు అయితేనే విస్మయం కలిగిస్తుంది. అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్. పాండురంగ చెరువు నుంచి నీళ్లు మళ్లించడానికి వ్యవసాయ శాఖ భారీగా నిధులను ఖర్చుపెట్టినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా 2016, 2017 సంవత్సరాలలో జారీ అయిన ప్రత్యేక జీవోలు తెరపైకి వచ్చాయి. జీవో నెం. 2: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మోడల్ గ్రామాలుగా గుర్తించి, 3 వేల ఎకరాల్లో బిందుసేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ఏర్పాట్లు చేయాలని నిర్ణయం. 100 శాతం సబ్సిడీ ఇస్తూ మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెబుతూ, తొలి విడతగా రూ. 42.54 కోట్లతో పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. జీవో నెం. 149: ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను నెటాఫిమ్ అనే ప్రైవేట్ కంపెనీకి కట్టబెడుతూ ఎంవోయూ కుదిరింది. అంచనా వ్యూయాన్ని రూ. 49.89 కోట్లకు పెంచారు. ఎలాంటి టెండర్ల ప్రస్తావన లేకుండా నేరుగా ఆ సంస్థకు అప్పగించడం గమనార్హం.
సవరణ జీవో నెం. 49: మొదట్లో ఉచితం అని చెప్పిన నెటాఫిమ్ సేవలకు చెల్లింపులు జరిపేలా ఒప్పందంలో మార్పులు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వి. ప్రవీణ్ రావు నేతృత్వంలోని కమిటీ ధ్రువీకరిస్తే చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తెలివిగా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించవచ్చని గతంలో కేసీఆర్ తరచూ చెప్పేవారు. తాను స్వయంగా వ్యవసాయం చేసే పెద్ద రైతునని చెప్పుకున్న ఆయన మాటలను నమ్మినప్పటికీ, ఆ కోటి రూపాయల లాభాల మర్మం మాత్రం ఇన్నేళ్లుగా ఎవరికీ అంతుబట్టలేదు. కానీ, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిణామాలు చూస్తుంటే ఆ సంపాదన సాధ్యమేననిపిస్తోంది. వేల కోట్ల ప్రజాధనంతో రిజర్వాయర్లు, భారీ కాలువలు, చెరువులు తవ్వి, నీటిని నేరుగా పొలాలకు తెచ్చిపోసేలా ప్రభుత్వ యంత్రాంగమే ఏర్పాట్లు చేస్తే, పంట ఆదాయం మొత్తం శుద్ధ లాభమే అవుతుంది కదా ఉచిత సలహాలిచ్చే వ్యవసాయ నిపుణులు కూడా తోడుగా ఉంటే రాబడి కోట్లలో ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కేసీఆర్ వ్యవసాయంలో లాభాల అసలు రహస్యం బహుశా ఇదేననే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.












