హకీంపేట, తెలంగాణ (ధర్మ రథం) నవంబర్ 08
రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. హకీంపేటలో మహిళా సంఘాలతో సమావేశమైన ఆయన, కొత్త పింఛనుదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను కొడంగల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. హకీంపేటలో మహిళా సంఘాలతో సమావేశమైన ముఖ్యమంత్రి, కొత్త పింఛనుదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్తగా 4.50 లక్షల పింఛన్లు మంజూరు చేస్తే, అందులో 3.50 లక్షల మంది మహిళలే ఉన్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆడబిడ్డలకు భరోసా ఉండాలనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళల పేరిటే మంజూరు చేశామన్నారు. మహిళలపై ఆర్థిక భారం తగ్గించాలని ఉచితంగా సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.
మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించినప్పుడు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆటో డ్రైవర్లతో గొడవ చేయించారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలనే వారిని తరిమికొట్టాలని అన్నారు. 70 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు తీసుకువచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3.40 కోట్ల మందికి సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తన జీవిత లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. తాను అడిగిన దానికంటే ఆడబిడ్డలు ఎక్కువే ఇచ్చారని రేవంత్ తెలిపారు. ఇంకా కొత్తగా కోరుకునే పదవులు ఏమీ లేవన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల యూనిఫామ్ల కుట్టింపు, పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళలకే అప్పగించామని తెలిపారు. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను కేటాయించామని తెలిపారు. బ్యాంకుల ద్వారా రూ.79 వేల కోట్లను మహిళలకు రుణాలుగా ఇచ్చామని తెలిపారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీగా రూ.1900 కోట్లను బ్యాంకులకు చెల్లించామని తెలిపారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. అంతకుముందు బొమ్రాన్పేటలో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం హకీంపేటలోని జడ్పీ స్కూల్, కళాశాల, పీహెచ్సీ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు.







