మధిర-అంబార్‌పేట చెరువు కట్ట కింద రోడ్డుపై కంకర మాత్రమే వేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు నాలుగేళ్ల క్రితం కొట్టుకుపోయిన ఈ రోడ్డును పది రోజుల క్రితం కంకరతో మాత్రమే పూడ్చి వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ప్రమాదాల భయం
ఈ కంకర రోడ్డుపై వాహనాలు వెళ్లేటప్పుడు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు కిందపడగా, ఒకరికి చేయి విరిగింది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మార్గంలో సుమారు 4-5 గ్రామాల ప్రజలు పలు వాహనాల్లో మధిర పట్టణానికి వస్తుంటారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
అధికారులకు విజ్ఞప్తి
ప్రమాదాలు జరగకుండా, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. కంకరపై తారు లేదా సిమెంట్‌తో పటిష్టమైన మరమ్మతులు చేపట్టి రోడ్డును సురక్షితంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.











