హైదరాబాదులోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక (24) మంగళవారం రాత్రి మరణించారు. గత నెల 26న మండలం మిట్టగూడెం వద్ద ప్రయాణీకురాలితో ఘర్షణలో బస్సు నుంచి జారిపడి టైర్ల కింద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
గత నెల 26వ తేదీన మండలం మిట్టగూడెం వద్ద జరిగిన సంఘటనలో, ప్రయాణీకురాలితో చిల్లర విషయంలో ఘర్షణ పడిన క్రమంలో తోపులాటలో బస్సులో నుంచి జారిపడ్డారు. ప్రయాణీకురాలు తోయడంతోనే ఆమె బస్సు టైర్ల కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఆమెకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదుకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె మరణవార్తతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రవళిక మృతిని నిరసిస్తూ బుధవారం ఖమ్మం రీజియన్లోని ఆర్టీసీ డిపోల్లో బంద్ నిర్వహించాలని కార్మిక జేఏసీ పిలుపునిచ్చింది.
పోలీసుల చర్య
ఇప్పటికే కండక్టర్ను బస్సు నుంచి తోసేసిన కేసులో ప్రయాణీకురాలు బాణోత్ మౌనికను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కార్మికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.


