కేరళ రాజధాని తిరువనంతపురంలో అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అదృశ్యమైన మరుసటి రోజు అతడి మృతదేహం ఓ నిర్మానుష్య ప్రాంతంలో సంచిలో పెట్టి పడేసిన స్థితిలో లభించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక దర్యాప్తులో స్నేహితుల మధ్య వివాదమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న అభిరామ్ అనే 17 ఏళ్ల విద్యార్థి, ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో స్నేహితులను కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.
సాయంత్రం తండ్రికి ఫోన్ చేసి త్వరలో ఇంటికి వస్తానని చెప్పాడు. అయితే ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ఫోన్ వివరాలు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
సంచిలో మృతదేహం గుర్తింపు
ఈ క్రమంలో పాంగప్పార ప్రాంతంలోని నిర్మానుష్య స్థలంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. శరీరాన్ని సంచిలో పెట్టి అక్కడ పడేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక పరిశీలనలో బెల్టుతో గొంతు బిగించి హత్య చేసి ఉండవచ్చని అనుమానించారు.
ప్రేమ వ్యవహారమే కారణమా
పోలీసుల ప్రాథమిక విచారణలో ఓ బాలికతో స్నేహం, ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాదం హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సందేశాలు పంపించి అభిరామ్‌ను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ముగ్గురు అదుపులోకి
ఈ కేసులో ఓ మైనర్ బాలుడు, ఓ యువతి, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు న వెలువడిన తాజా నివేదికలు తెలిపాయి. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.




