జగిత్యాల, 2026-08-07
జగిత్యాల జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ పాల్గొని విద్యార్థులకు సైబర్ మోసాల నివారణ, డిజిటల్ భద్రతపై కీలక సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లా: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ సూచించారు. సురక్షా కా తిరంగా , , అనే సందేశంతో విస్తృత సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగ్రూక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా, ఈ అవగాహన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని పీబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్, అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్, ఐపీఎస్ పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ, డిజిటల్ భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ లింకులు, మోసపూరిత ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మోసాలు, నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి మోసాలు, క్యూ ఆర్ కోడ్ స్కామ్‌లు, ఓటీపీ మోసాలు, ఆన్లైన్ గేమింగ్ మోసాలు తదితర అంశాలపై సవివరంగా వివరించారు.
డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అలాగే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
సైబర్ మోసాలకు తక్షణ ఫిర్యాదు
ఆన్లైన్లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని, అలాగే ... పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై వారికి అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలకు కూడా తెలియజేసి సైబర్ నేరాల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.












