కాజీపేట్, 5 August
కాజీపేట ఫాతిమా బ్రిడ్జి ఆధునీకరణ పనుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. 1970లో నిర్మించిన వంతెన ఆధునీకరణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని, రూ.78 కోట్ల నిధులను తెచ్చిందని మాజీ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి తెలిపారు.
కాజీపేట ఫాతిమా బ్రిడ్జి ఆధునీకరణ పనుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. 1970లో ప్రజల అవసరాల కోసం నిర్మించిన 60 అడుగుల వంతెనను కాంగ్రెస్ పార్టీ ఆధునీకరించిందని, రూ.78 కోట్ల నిధులను తెచ్చి ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని 63వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేటీఆర్ గో బ్యాక్ అని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ మెడలు వంచి, 48 మంది కాంగ్రెస్ నాయకులు కేసులు సైతం లెక్కచేయకుండా పోరాడి ఈ నిధులను సాధించుకున్నారని ఆమె తెలిపారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పనులను శరవేగంగా పూర్తి చేయిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి దక్కే మైలేజ్‌ను ఓర్వలేక కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులను అడ్డుకోవాలని చూస్తున్న బీజేపీ నాయకుల చౌకబారు రాజకీయాలు ఇక చెల్లవని ఆమె విమర్శించారు.
రోడ్లపై కూర్చుని రాస్తారోకోలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని, నిజంగా ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే, కేంద్రంలో ఉన్న అధికారంతో, రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని సూచించారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించేలా ఒప్పించాలని, వ్యాగన్ తయారీ కేంద్రం/కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగ యువతకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని, ఇక్కడి రైల్వే క్రూ కంట్రోల్ ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ఆపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె బీజేపీని కోరారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుల, మత, పార్టీలకు అతీతంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లకు నిధులు కేటాయిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేక గాలికి బాణాలు వేస్తూ, కాంట్రాక్టర్లతో కుంభకోణాలు చేశారంటూ అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని విజయశ్రీ హెచ్చరించారు. ఆధారాలుంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఎన్ని కుట్రలు చేసినా, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడినా, హనుమకొండ, కాజీపేట, వరంగల్ ప్రజలకు నరకం చూపిస్తున్న ఈ రాకపోకల సమస్యకు ముగింపు పలుకుతూ, అతి త్వరలోనే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగానే కాజీపేట ఫాతిమా వంతెన ప్రారంభమవుతుందని, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అని ఆమె స్పష్టం చేశారు.











