ఎల్కతుర్తి, 2026-08-10
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రూ.3.25 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) భవనాన్ని వారు సోమవారం ప్రారంభించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పేదల పక్షపాతిగా పనిచేస్తోందని తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో రూ.3.25 కోట్లతో నిర్మించిన కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.
ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, పేద కుటుంబాల పిల్లలు కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం విద్యారంగంపై భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లలు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలను 40 శాతం, పేదింటి ఆడపిల్లలు వసతి గృహాల్లో చదువుకునేందుకు అవసరమైన కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర సామగ్రిని విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజుల్లోపే నాణ్యమైన మెటీరియల్‌తో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున కేటాయించి, సుమారు 3,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను నిర్మిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేద పిల్లలకు మంచి విద్యను అందిస్తే వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా, మరో పది మందికి, వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని మంత్రి అన్నారు. గతంలో పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాల వద్ద పెద్దఎత్తున భూములు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ చెబుతున్నారని పేర్కొన్నారు. అందుకే పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
విద్య, వైద్యం పేదల జీవితాలకు రెండు కళ్లు
విద్య, వైద్యం పేదల జీవితాలకు రెండు కళ్ల వంటివని, ఈ రెండు రంగాలను బలోపేతం చేసి పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి వెంటనే స్పందించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రిల్స్, ప్రహరీ తదితర అవసరమైన పనులను టాప్ ప్రాధాన్యతతో చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


