న్యూఢిల్లీ, 2026-08-27
దేశ భద్రతకు అత్యంత కీలకమైన క్షిపణుల తయారీని కూడా ప్రయివేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన చోట వాటితోనే ప్రయివేట్ కంపెనీలను పోటీకి దింపడం వంటి పరిణామాలు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి.
దేశ భద్రతకు అత్యంత కీలకమైన క్షిపణుల తయారీని కూడా ప్రయివేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన చోట వాటితోనే ప్రయివేట్ కంపెనీలను పోటీకి దింపడం వంటి పరిణామాలు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. అస్త్ర, ప్రళయ్ వంటి వ్యూహాత్మక ఆయుధాల తయారీలో వేల కోట్ల రూపాయల మార్కెట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు అందుబాటులోకి రానుంది.
ప్రశ్నార్థకంగా ఆత్మనిర్భర్ లక్ష్యం
దేశ రక్షణ రంగంలో కీలకమైన క్షిపణుల తయారీలో కూడా ప్రయివేట్ రంగానికి ద్వారాలు తెరిచేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణుల ఉత్పత్తిలో ప్రధానంగా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు (డీపీఎస్‌యూలు), ముఖ్యంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వంటివి కీలక పాత్ర పోషించేవి. ఇకపై అర్హతలు, ధ్రువపత్రాలు, నియంత్రణ అనుమతులకు లోబడి ప్రయివేట్ కంపెనీలూ ఈ ఉత్పత్తి ఒప్పందాల కోసం పోటీ పడే అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆత్మనిర్భర్ పేరుతో రక్షణ రంగ ప్రయివేటీకరణకు మరో మెట్టుగా పరిగణించవచ్చా ప్రజాధనంతో అభివృద్ధి చేసిన సాంకేతికత, సున్నితమైన జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తుల నుంచి లాభాలు ఆర్జించేందుకు కార్పొరేట్ రంగానికి కేంద్రం తలుపులు ఎందుకు తెరుస్తోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
వేల కోట్ల మార్కెట్‌కు ద్వారాలు తెరిచిన కేంద్రం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ రక్షణ కంపెనీలకు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. దీనివల్ల దేశీయ తయారీ సామర్థ్యం పెరుగుతుందని, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, దేశీయ విలువ జోడింపు పెరుగుతుందని, ఎంఎస్ఎంఈలు, ఇతర సాంకేతిక భాగస్వాములకు రక్షణ ఉత్పత్తుల సరఫరాలో అవకాశాలు లభిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం వెనుక మరో కీలక అంశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు. క్షిపణుల తయారీకి సంబంధించిన వేల కోట్ల రూపాయల మార్కెట్ ఇక ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం కాకుండా ప్రయివేట్ కంపెనీలకూ అందుబాటులోకి రానుందని అంటున్నారు.
బీడీఎల్‌కు ఇక పోటీ తప్పదు
ఇప్పటివరకు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన క్షిపణుల సీరియల్ ఉత్పత్తిలో బీడీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రధాన స్థానం ఉండేది. కొత్త విధానంతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ కంపెనీలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. డీఆర్డీఓ కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడమే కాకుండా, సంప్రదాయ క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో ప్రయివేట్ సంస్థలను భాగస్వాములుగా చేర్చే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.











