ఖమ్మం జిల్లా గ్రీన్ఫీల్డ్ హైవేపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో రహదారి భద్రతా క్రాష్ బారియర్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో రహదారికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ఇది సంభవించిందని అధికారులు తెలిపారు. లారీ నేరుగా డివైడర్ వైపు దూసుకెళ్లి, యూ-టర్న్ రైలింగ్తో పాటు మెటల్ బీమ్ క్రాష్ బారియర్ను అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి రహదారి మధ్యలోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే హైవే పెట్రోలింగ్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టారు.
ధ్వంసమైన బారియర్లు, పైప్లైన్లను వెంటనే పునరుద్ధరించే పనులు ప్రారంభించినట్లు మెయింటెనెన్స్ విభాగం అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












