మండలంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కాకునూర్సుందరాపూర్ శివారుతో పాటు పీ.ఐ. కంపెనీ సమీపంలో, శారదా ఫంక్షన్ హాల్ వద్ద విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగే సూచనలు కళ్లముందే కనిపిస్తున్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు మండలంలో వినిపిస్తున్నాయి. మాకెందుకు.. ఎవరికైనా జరిగితే చూద్దాం అనే ధోరణితో వ్యవహరిస్తున్నారా.. లేక ప్రమాద తీవ్రతపై అవగాహన లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాకునూర్సుందరాపూర్ శివారు ప్రాంతంలోని రైతుల పొలాల వద్ద విద్యుత్ స్తంభాలు ఒకే వైపునకు వంగిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వీటి విషయంలో రైతుల నిర్లక్ష్యమా.. అధికారుల నిర్లక్ష్యమా.. అసలు బాధ్యత ఎవరిది.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అదే విధంగా లోని పీ.ఐ. కంపెనీ సమీపంలో, శారదా ఫంక్షన్ హాల్‌కు వెళ్లే చౌరస్తా వద్ద కూడా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటి పక్కనే పెద్ద విద్యుత్ లైన్ ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
ఒక్క చిన్న ప్రమాదం జరిగితే ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. అప్పుడు నష్టపరిహారం, విచారణ, పరామర్శలు చేసుకోవడం కంటే.. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవడం మేలుకాదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో జరిగిన తర్వాత చూద్దాం అనే ధోరణికి తావుండకూడదని, ప్రమాద సూచికలు కనిపిస్తున్నప్పుడు వాటిని గుర్తించి, సంబంధిత శాఖలు వెంటనే పరిశీలించి అవసరమైన మరమ్మతులు, స్తంభాలను సరిచేయడం, భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రమాదం కోసం ఎదురుచూస్తున్నారా
అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఈ ప్రాంతాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కూడా ప్రమాదకర పరిస్థితులను గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
ప్రశ్న ఒక్కటే.. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకుంటారా.. లేక ప్రమాదం జరిగిన తర్వాత ముందే గుర్తించి ఉంటే బాగుండేది అని చేతులు దులుపుకుంటారా.. ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యానికి చోటు లేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.












