జాతీయ పోషణ మాసంలో భాగంగా జగిత్యాల అర్బన్-2 సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గృహ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతల ఇళ్లను సందర్శించి, వారికి అవసరమైన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు జగిత్యాల అర్బన్-2 సెక్టార్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంగన్వాడీలో నమోదు కాని వారిని గుర్తించి నమోదు చేశారు. కుటుంబ సభ్యులకు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, గింజలు, చిరుధాన్యాలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.
గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు. శిశువుకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు మాధవి, ఇతర అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












