జిల్లా నెక్కొండ పట్టణంలో పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకోగా, అతని వద్ద 12 కిలోల ఎండు గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
నెక్కొండ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద 12 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నితిన్ న్యాను షిండే అనే పోలీస్ కానిస్టేబుల్, ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయించడానికి తరలిస్తుండగా పట్టుబడ్డాడని ఎస్సై శ్రావన్ కుమార్ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.












