పట్టణంలోని 22వ వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్ అరవ లక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణతో పాటు వార్డుల పరిశుభ్రతపై ఆమె దృష్టి సారించారు.
పట్టణంలోని 22వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్ అరవ లక్ష్మి కలిసి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డుల్లో రోడ్లు, వీధుల పరిశుభ్రతతో పాటు ఇంటింటి చెత్త సేకరణ కార్మికుల పనితీరును చైర్పర్సన్ పరిశీలించారు. చెత్త సేకరణ ప్రతి ఇంటి నుంచి క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.
ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం మున్సిపాలిటీ ప్రధాన బాధ్యత అని, ప్రతి వార్డులో పారిశుధ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, పారిశుధ్య కార్మికులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పట్టణ పరిశుభ్రతకు మరింత కృషి చేయాలని చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు.
ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందిస్తూ, ఇంటింటి చెత్త సేకరణకు సహకరించాలని ఆమె కోరారు. పరిశుభ్రమైన జగిత్యాల కోసం మున్సిపాలిటీతో పాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్ రాజేంద్ర ప్రసాద్, వార్డు అధికారులు, జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.


