తెలంగాణ అసెంబ్లీలో 22 ఏళ్ల నిషేధిత భూములపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ నాయకులంటే భయమని, అందుకే అరెస్టులు చేయిస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు.
హనుమకొండ/శాయంపేట: తెలంగాణ అసెంబ్లీలో 22 ఏళ్ల నిషేధిత భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివను పోలీసులు ఉదయం 5 గంటలకే పోలీస్ స్టేషన్ కు తరలించి ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గత 1000 రోజుల నుంచి రాక్షస పాలన నడుస్తోందని, ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు విధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని అన్నారు. నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయిస్తున్నావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ తుగ్లక్ పాలనకు నిదర్శనం కాదా అని అన్నారు.
విద్యాశాఖకు మంత్రిని నియమించకుండా మీ దగ్గరే పెట్టుకున్నారని, విద్యార్థులకు 14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ముగిసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా సస్పెండ్ చేసి, ప్రజల గొంతును నొక్కి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు మానుకోవాలని కోరారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, రాబోయే కాలంలో ప్రజల చేతిలో, విద్యార్థుల చేతిలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరించారు.











