పరకాల పట్టణ కేంద్రంలో గురువారం నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, త్యాగాల ఫలితంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పరకాల అమరధామానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఇది మరో జలియన్‌వాలాబాగ్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











