తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో గల కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ఉప్పుల రామయ్య గార్ల విగ్రహాలకు రైతు సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో గల కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ఉప్పుల రామయ్య గార్ల విగ్రహాలకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు దేవర వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం ప్రభుత్వాన్ని, జమీందారులను, జాగిర్దారులను గడగడలాడించిన మహత్తర చరిత్ర కలిగిన వీరోచిత పోరాటమని కొనియాడారు. ఈ పోరాటంలో భాగంగా తెలంగాణలో 10 లక్షల ఎకరాల జమీందారీ, జాగీర్దారుల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఉందని, 3,000 గ్రామాలను విముక్తి చేసిన ఘనత ఉందని, 4,000 మంది అమరులైన చరిత్ర కలిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటమని తెలిపారు. ఈ చారిత్రక స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దేవరం శ్రీనివాస్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్, నాయకులు దేవరం శ్యాంసుందర్ రెడ్డి, లంజేపల్లి వెంకయ్య, నెమ్మది ముత్తయ్య, వట్టెపు సైదులు తదితరులు పాల్గొన్నారు.







